Friday, April 23, 2010

టీ వీ చానల్స్ --- చెత్త కార్యక్రమాలు --అంధ్ర భూమి సాక్షి నుంచి

దొంగలు పడ్డ ఆర్నెల్లకి కుక్కలు మొరగడమంటే ఇదే. కుర్రకారు విరగబడి చూసే ఫ్యాషన్ టెలివిజన్ (ఎఫ్.టి.వి.) నిరుడు సెప్టెంబర్ 4 రాత్రి ఓ చెత్త ప్రోగ్రాం వేసిందట. ఒంటిపై భాగాన ఆచ్ఛాదనలేని అమ్మాయిల పరువాలను అందులో రెచ్చిపోయి చూపించిందట. అది మహిళలను కించపరచుట, అసభ్యత వగైరా అపరాధాలకిందికి వస్తుందని తేల్చుకోవటానికి ఘనత వహించిన భారత సర్కారులో మహాఘనత వహించిన సమాచార, ప్రసార ప్రసారశాఖవారికి అక్షరాలా ఆరునెలలు పట్టిందట. చాలా ఆలోచించి చించి ఎట్టకేలకు ఈ ధర్మనిర్ణయం చేసిన మీదట నిన్నటినుంచి పదిరోజులపాటు సదరు టీవీ ప్రసారాలను దేశంలో బ్యాన్ చేశారట. అసలు జరగనిదానికంటే ఆలస్యం మేలు. కాని ఇప్పుడు పెట్టిన నిషేధం అయినా నికరమేనా? చెప్పలేము. ఇదే చానల్ మీద ఈ బాపతు బాన్ పెట్టటం ఇది ముచ్చటగా మూడోసారి... ‘మిడ్‌నైట్ హాట్’ పేరిట అర్ధరాత్రి అర్ధనగ్న భామినుల తైతక్కలను చూపిస్తున్నారని ఎఫ్.టి.వి. మీద ఇలాగే రెండు నెలలు నిషేధం పెట్టారు. తప్పయిపోయింది, సారీ అని లెంపలేసుకునేసరికి మధ్యలోనే దాన్ని ఎత్తేశారు. అంతకుముందు ప్రపంచంలోని బూతు అడ్వర్టయిజ్‌మెంట్లలోకెల్లా పచ్చిబూతువి గుదిగుచ్చి చూపించినందుకు సోనీ వారి యాక్షన్ ఛానల్ తినూ ఇలాగే బాన్ చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పేసరికి ఉదారంగా ఎత్తేశారు. కాబట్టి చానల్ తప్పులు సారీతో సరి!
* * *
పోనీ - కడదాకా యథావిధిగా నిషేధం అమలైందే అనుకుందాం. బుల్లితెరపై అశ్లీలపు బులపాటాలకు అంతటితోనే తెరపడుతుందా? తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవన్నట్టు ఆషామాషీ నిషేధాలకు బరి తెగించిన చానెళ్లు బెదరవు. శ్రీ గవర్నమెంటు వారి దృష్టిపడిన ఎఫ్.టి.వి. ప్రోగ్రాం కంటే అసభ్యమైన, అశ్లీలమైన, పరమరోత ప్రోగ్రాంలను దేశమంతటా కుక్కగొడుగుల్లా పుట్టుకొచ్చిన జాతీయ, ప్రాంతీయ, నానారకాల, చానళ్లు తెగబడి ముప్పూటలా చూపిస్తూనే ఉన్నాయి. మాటవరసకు మన తెలుగుచానెళ్లలో రాత్రి 11 తరవాత నడిచే మిడ్‌నైట్ మిర్చిమసాలాల్లో శృంగారం పేరు పెట్టి చవకబారు సెక్సును దట్టించి చూపించే విచ్చలవిడితనాలతో పోలిస్తే ఎఫ్.టి.వి. వాళ్ల ‘‘మిడ్‌నైట్ హాట్’’ కూడా ఓ హాటేనా?! ‘‘పిటపిటలాడే ఈ అమ్మడి ఫిగర్ చూస్తే పండు ముదుసలైనా జోడుగుర్రాల స్వారీ చేస్తాడు’’ లాంటి ప్రశస్తమైన, పరమశుభ్రమైన డైలాగులు పలికే తెలుగు యాంకరీమణుల చింతామణి చిందుల ముందు ఫారిన్ టీవీల్లో సీమ దొరసానుల సానివేషాలొకలెక్కా?!
* * *
మిడ్‌నైట్ మసాలాలను ఆపమంటూ పాతకాలపు ఛాందసులెవరో కోర్టుకెక్కి ఆ మధ్య కొన్నాళ్లు నిలిపివేయిస్తే మాత్రం ఏమయింది? పేర్లు మార్చుకుని మారువేషాల్లో అవి సిగ్గుబిళ్లలు తెంపుకుని మళ్లీ జనంమీదపడలేదా? ఆమాటకొస్తే నేరాలూ ఘోరాల కథనాలను పరమఘోరంగా చూపించటం మానాలని మన రాష్ట్రంలోకెల్లా ఉన్నతమైన హైకోర్టు ఆజ్ఞాపిస్తే మాత్రం చానెళ్లు జంకాయా? పేర్లు మార్చి మళ్లీ వాటినే మరింత రోతగా, సాధ్యమైనంత హింసాత్మకంగా చూపిస్తూ సమాజంలో నేరప్రవత్తిని, హింసాప్రకోపాన్ని పెంచటానికి శాయశక్తులా పాటుపడటం లేదా? అర్ధరాత్రి మదపిచ్చి కార్యక్రమాలొస్తున్నాయి కనుక ఆ వేళలో కుర్రజనం టీవీలు చూడకుండా ఇంటి పెద్దలు తలచుకుంటే ప్రయత్నం చేయగలరు. కాని అన్ని వయసుల వాళ్లూ అన్ని కాలాల్లో దీక్షగా చూసే న్యూస్ చానెళ్లలో పగలు, రాత్రి తేడా లేకుండా విజృంభించి చూపించే బీభత్స, జుగుప్సావహ పచ్చిబూతు బాగోతాలమాటేమిటి? విశాఖపట్నంలో ఫలానా తండ్రీకొడుకుల మదపిచ్చి ఎటువంటిదో, అది ఎవరిమీద ఏఏ భంగిమల్లో ఏ తీరున ప్రకోపిస్తుందో వారి బారినపడ్డ శీలవతుల చేత సిగ్గులేకుండా చెప్పించి పూటకు పదిసార్లు అదేఅదే వార్త ముసుగులో ప్రసారం చేయించటం ఏ సామాజిక ప్రయోజనాన్ని ఆశించి? ఈ రకమైన కామపైత్యాల విశృంఖల ప్రచారం లేత వయసు పిల్లలమీద ప్రసరించేది ఏ రకమైన ప్రభావం? ఎక్కడో తమిళనాడులో తెలుగు జనానికి బొత్తిగా తెలియని ఎవడో నిత్యానంద స్వామికి ఎవరో సినీనటి పవళింపు సేవ చేస్తే ఆ దిక్కుమాలిన వీడియోను ఎత్తుకొచ్చి, చెత్తపాటలు చేర్చి, రోజుల తరబడి విసుగులేకుండా చొంగ కార్చుకుంటూ అహర్నిశలూ నిత్యపారాయణం చేయించటం అశ్లీలం కాదా? అసభ్యం కాదా? మనుషులు తగులబడే దృశ్యాన్ని సవిస్తరంగా చిత్రీకరించి, ఉరి వేసుకున్న వారిని అమరవీరులుగా కీర్తించి, అవే అవే బీభత్సదృశ్యాలను మళ్లీమళ్లీ తెరమీద చూపిస్తూ, ఉన్మాదాన్ని రెచ్చగొట్టి, ఇంకా ఎక్కువమందిలో అమరత్వం కాంక్ష పుట్టించి, మరిన్ని ఆత్మాహుతులకు టీవీ చానెళ్లు పురికొల్పటం సామాన్యమైన నేరమా? అలాగని న్యూస్ చానెళ్లు మాత్రమే పాపాలభైరవులా? ఎంటర్‌టైన్‌మెంటు చానెళ్లు ఎక్కించే మెంటల్ మంటలు సామాన్యమైనవా? అత్తాకోడళ్లూ, మొగుడూ పెళ్లాలూ ఒకరినొకరు చంపాలని వేసే ప్లాన్లతో పుచ్చిపోయిన పిచ్చి సీరియళ్లే కదా ఎక్కడ చూసినా? వాటి బాధే పడలేకపోతున్నామంటే పులిమీద పుట్రలా తింగరవంకర రియాలిటీ పైత్యాలు! పెళ్లాన్నికొట్టి, విడాకులు పుచ్చుకున్న ముదురు వయసు గ్రంథసాంగుడి స్వయంవరమనేసరికి ననే్న పెళ్లాడమంటూ పోటీలు పడి వెంటపడే మానవతుల నయగారాలు! ముక్కుపచ్చలారని పిల్లలకు అడ్డమైన పోటీలు! వాటికి తీర్పరులుగా గూండాల్లాంటి భయంకర మానవులు! పోటీదారుల మధ్య కొట్లాట పెట్టి ‘పోరా’, ‘పోవే’ లాంటి నాజూకైన పదాలతో కోడిపుంజుల్లా కాట్లాడుకునేట్టు చేసే అష్టవంకర యాంకరులు! ఫలానా దయ్యపు మేకపులో ఫలానా పిశాచపు డాన్సులో ఫలానా గంతు సరిగా వెయ్యలేదంటూ ఎద్దుల్లాంటి పెద్దలు బిక్కమొగపు పిల్లలను మాటలతో కాకుల్లా పొడిచి, చీపో అంటూ గెంటేసే హృదయ విదారక దృశ్యాలు! వాటన్నిటినీ చిదానందంగా సమర్థిస్తూ, యథాశక్తి బిడ్డలను హడలగొట్టి, సదరు దిక్కుమాలిన పోటీలో గెలవకపోతే కొంపలు మునుగుతాయన్నట్టు కెవ్వుకెవ్వుమనే బుద్ధిలేని తల్లిదండ్రులు! వెరశి - ఈ కాలంలో ఈ బాపతు ప్రతి టీవీ చానలూ ఒక పిచ్చాసుపత్రి!
-సాక్షి

2 comments: